Kalvakuntla Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో హరీశ్ రావు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) తాను అందజేసిన ఫిర్యాదు పత్రాలను ఇవాళ ఆమె సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బహిర్గతం చేశారు.
అవినీతికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారు సీఎం గారూ? అంటూ కవిత నేరుగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ నెల 14న సీఎంఓకు తాను సమర్పించిన ఈ ఫిర్యాదు లేఖలను అధికారులు నవంబర్ 18న అధికారికంగా స్వీకరించారని ఆమె తెలిపారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం, డిజైన్ మార్పులు, పంప్ హౌస్ పనుల్లో తీవ్ర నాణ్యతా లోపాలు, అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు.
తన ఫిర్యాదు లేఖలోని ముఖ్యాంశాలను కవిత స్పష్టం చేస్తూ.. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో జరిగిన అవినీతి, డిజైన్ మార్పులు, నాణ్యతా లోపాలపై ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వరకు నీటిని తరలించే కాలువ డిజైన్‌లో మార్పులు, పంప్ హౌస్ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టిన విచారణకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాం అని పేర్కొన్నారు. సీఎం పర్యటన రోజే కవిత ఈ లేఖలను బయటపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.