Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చే నెలలో తిరిగి దేశానికి వస్తానని ప్రకటించిన తరుణంలో బంగ్లాదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల సోమవారం రాత్రి వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
షేక్ హసీనా స్వదేశానికి రానుండటంతో బంగ్లాదేశ్‌లో వరుస నిరసనలు, బాంబు దాడి ఘటనలు మిన్నంటుతున్నాయి. ఇందులో భాగంగానే మొదటి బాంబు విమానాశ్రయం బయటి గేటు వద్ద పేలగా, రెండవ బాంబు జసిముద్దీన్ ప్రాంతంలోని ఫ్లైఓవర్‌పై పేలింది. మరోవైపు, వస్త్ర పరిశ్రమ కార్మికులు వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.
డిసెంబర్‌లో హసీనా రాక నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైళ్లు, బస్సులు, బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక ఘటనలు, దహనాలు, విధ్వంసాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ అల్లర్ల వెనుక హసీనాకు చెందిన నిషేధిత అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థల ప్రమేయం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా షేక్ హసీనా స్వస్థలమైన గోపాల్‌గంజ్ జిల్లాలో హింస తీవ్రరూపం దాల్చింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అక్కడ సుమారు 2000 మంది పోలీసులను మోహరించింది. వీరితో పాటు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (కు చెందిన 10 దళాలు, స్పెషల్ రెస్పాన్స్ బెటాలియన్ సిబ్బందిని రంగంలోకి దించారు.
మరోవైపు, షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను డిమాండ్ చేస్తోంది. అయితే ఆమె అప్పగింతపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే, హసీనాను అప్పగించే విషయంలో భారత్ బంగ్లాదేశ్‌కు రెండు ప్రధాన షరతులు విధించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. హసీనా భద్రతా బాధ్యతలను పూర్తిగా బంగ్లాదేశ్ సైన్యం చూసుకోవాలని, ఆమెకు విధించిన ఉరిశిక్షపై ఉన్నత కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు నిష్పక్షపాత విచారణ జరుగుతుందని గ్యారెంటీ ఇవ్వాలని భారత్ కోరినట్లు సమాచారం.