Kondagattu Chandanotsavam: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అరుదైన చందనోత్సవం శుక్రవారం వైభవంగా ముగిసింది. దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భక్తులకు అంజన్న నిజరూప దర్శన భాగ్యం కలగడం విశేషం. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించి తరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తజనం కొండగట్టుకు పోటెత్తుతున్నారు.

శాస్త్రోక్తంగా చందనం తొలగింపు ప్రక్రియ పూర్తి
గత 60 సంవత్సరాలుగా స్వామివారి మూలవిరాట్టుపై పేరుకుపోయిన చందనం కవచాన్ని తొలగించే క్రతువును ఆలయ అర్చకులు, అధికారులు అత్యంత నియమనిష్ఠలతో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నెల 15వ తేదీన విశేష పూజలతో మొదలైన ఈ ప్రక్రియ 18వ తేదీ సాయంత్రం వరకు సాగింది. ఈ రోజుల్లో నిత్యం హోమాలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించడంతో పాటు, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం కేవలం బంగారం, వెండి, చెక్కతో తయారు చేసిన ప్రత్యేక పరికరాలను ఉపయోగించి స్వామివారిపై ఉన్న చందనాన్ని జాగ్రత్తగా తొలగించారు.
Kondagattu Chandanotsavam: పంచనదుల జలాలతో అభిషేకం.. భద్రాద్రి పట్టువస్త్రాలతో అలంకరణ
చందనం తొలగింపు పూర్తయిన తర్వాత పవిత్ర పంచనదుల జలాలు, సముద్రపు నీటితో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి మహాభిషేకం నిర్వహించారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన పట్టువస్త్రాలతో అంజన్నను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంప్రదాయం ప్రకారం తొలుత అద్దంలో స్వామివారి దివ్య రూపాన్ని ప్రతిబింబింపజేసిన అర్చకులు, ఆ తర్వాతే సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.
డిసెంబర్ 29 వరకు నిజరూప దర్శనం.. హాజరైన ప్రముఖులు
ఈ చారిత్రక ఘట్టంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలతో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చివరిసారిగా 1965లో ఈ చందనోత్సవం జరిగిందని, మళ్లీ 60 ఏళ్ల తర్వాత లభించిన ఈ అరుదైన నిజరూప దర్శనం డిసెంబర్ 29వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో ఉంటుందని ఆలయ అర్చకులు స్పష్టం చేశారు.