AMR Awareness : ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారుతున్న సమస్యల్లో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) ఒకటి. బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వాటిని నియంత్రించేందుకు ఉపయోగించే మందులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడాన్నే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల సాధారణ ఇన్ఫెక్షన్లకు సైతం మందులు సరిగా పనిచేయకపోవచ్చు. ముఖ్యంగా అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం, వైద్యుల సూచన లేకుండా మందులు తీసుకోవడం, చికిత్సను మధ్యలోనే ఆపేయడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఐటీసీకి చెందిన సావ్లాన్ స్వస్థ్ ఇండియా మిషన్ ‘#వీలవ్యాంటీబయాటిక్స్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. నవంబర్ 18 నుంచి 24 వరకు నిర్వహించే ప్రపంచ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అవగాహన వారాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. యాంటీబయాటిక్స్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించడంతో పాటు, చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఈ ప్రచారం వివరిస్తోంది. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవడం వల్ల వ్యాధికారక క్రిముల వ్యాప్తిని తగ్గించి, యాంటీబయాటిక్స్ అవసరమయ్యే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని సంస్థ పేర్కొంటోంది.
యాంటీబయాటిక్స్ వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి.. చేతుల శుభ్రతే కీలకం!
యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా చికిత్స చేయడం కష్టమయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై ఐటీసీ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ హెడ్ సమీర్ సత్పతి మాట్లాడుతూ.. ఇళ్లలోనే కాకుండా ఆసుపత్రుల్లోనూ ఇన్ఫెక్షన్లు సోకకుండా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. మరోవైపు అపోలో హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ విజయ్ యేవాలే మాట్లాడుతూ.. చిన్నపాటి జ్వరం, దగ్గు, జలుబు వచ్చిన వెంటనే యాంటీబయాటిక్స్ వాడటం సరికాదని సూచించారు. ముఖ్యంగా సాధారణ వైరల్ జలుబుకు యాంటీబయాటిక్స్ పనిచేయవని, వైద్యుల సలహా లేకుండా పాత మందులు వాడకూడదని స్పష్టం చేశారు. డాక్టర్ సూచించిన విధంగానే మందులు తీసుకోవాలని, చికిత్సలో మార్పులు చేయాల్సి వస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఫే డిసౌజాతో కలిసి సావ్లాన్ రూపొందించిన ‘డాక్స్ పాడ్’ పాడ్‌కాస్ట్ సిరీస్ ద్వారా కూడా ఏఎంఆర్ ప్రమాదాలు, నివారణ మార్గాలపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. మొత్తంగా యాంటీబయాటిక్స్‌ను బాధ్యతగా వాడటం, సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి చిన్న అలవాట్లే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ ప్రచారం తెలియజేస్తోంది.