96 Media, 19 నవంబర్ 2026: Byreddy Siddharth Reddy: వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కర్నూలులోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు, ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం విధించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పాములపాడు మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక నేపథ్యంలో, ఆయన అక్కడికి వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

Byreddy Siddharth Reddy: పాములపాడు ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ
పాములపాడు మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో వైసీపీ 6, టీడీపీ 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డిని గృహనిర్బంధం చేసినట్లు సమాచారం.
కూటమి సర్కార్, పోలీసుల తీరుపై బైరెడ్డి తీవ్ర ఆగ్రహం
తన హౌస్ అరెస్ట్ నేపథ్యంలో పోలీసుల తీరుపై, అధికార కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీపీ ఎన్నికల వేళ టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. “టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పుతో గెలిచాం. కూటమి నేతలకు ఎన్నికల్లో గెలవడం చేతకాక పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి.. మా ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, ఈ గృహనిర్బంధంపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.