96 Media, 20 నవంబర్ 2026: LB Nagar: రూ.74 లక్షల ఆన్లైన్ పెట్టుబడి మోసం.. తొమ్మిది మంది అరెస్ట్!
LB Nagar: రూ.74 లక్షల ఆన్లైన్ పెట్టుబడి మోసం.. తొమ్మిది మంది అరెస్ట్!
ఎల్బీనగర్: ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ.74 లక్షలు కాజేసిన సైబర్ ముఠా గుట్టును మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 8, 2026న బాధితుడిని అతని అనుమతి లేకుండానే ‘D-108 AXIS ALPHA INVESTORS’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే 5 నుంచి 50 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. కొనుగోళ్లు, అమ్మకాలు, బ్లాక్ ట్రేడింగ్ పేరుతో వివిధ పెట్టుబడి సూచనలు ఇచ్చారు. మరోవైపు లాభాలు వస్తున్నట్లు నమ్మించేందుకు కొందరు గ్రూపులో సందేశాలు పంపించారు.
అనంతరం AXIS SECURITIES పేరుతో ఉన్న యాప్‌లో రిజిస్టర్ చేయించి విడతల వారీగా పెట్టుబడులు పెట్టించారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మొత్తం రూ.74 లక్షలు నష్టపోయాడు.
బ్యాంకు ఖాతాలే లక్ష్యంగా..
దర్యాప్తులో మోసానికి పాల్పడిన సొమ్మును తరలించేందుకు నిందితులు పలువురి బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు గుర్తించారు. ఖాతాదారులకు 20 శాతం, మధ్యవర్తులకు 5 శాతం కమీషన్ ఆశ చూపించి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఖాతాల ద్వారా మోసపూరితంగా వచ్చిన డబ్బును ఇతరులకు బదిలీ చేసినట్లు వెల్లడించారు.
ప్రధాన నిందితులు రాహుల్, గౌరవ్ సూచనల మేరకు మిగిలిన నిందితులు వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి తొమ్మిది సెల్ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
పోలీసుల హెచ్చరిక:
తెలియని వ్యక్తులు పంపే పెట్టుబడి లింకులను నమ్మవద్దని, అధిక లాభాల ఆశ చూపే యాప్‌లలో పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు సూచించారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ, పిన్, ఆధార్, పాన్ వివరాలను ఇతరులకు ఇవ్వకూడదని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పర్యవేక్షణలో, సైబర్ క్రైమ్స్ డీసీపీ ఎస్.వి. నాగలక్ష్మి, ఏసీపీ కె. బాలకృష్ణారెడ్డి మార్గదర్శకత్వంలో ఇన్స్పెక్టర్ జె. నాగచారి, ఆయన బృందం ఈ కేసును ఛేదించింది.