Telangana Jobs :తెలంగాణలో వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆయుష్ (AYUSH) విభాగంలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 70 పోస్టులను భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 2, 2026లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయంటే..
ఈ నియామక ప్రక్రియ ద్వారా ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్య విభాగాల్లోని మొత్తం 45 విభాగాలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ముఖ్యంగా లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్ల ఖాళీలు ఉన్నాయి. వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు, ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ నియామకాలు చేపడుతున్నారు.

వైద్య రంగంలో నియామకాల జోరు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత మూడేళ్ల కాలంలో ఒక్క వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోనే దాదాపు 15 వేల పోస్టులను భర్తీ చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిరంతర చర్యలు తీసుకుంటోంది
. ఇందులో భాగంగానే ఆయుష్ విభాగంలో ఇప్పటికే 137 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయగా, తాజాగా మరో 70 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా, ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Epaper: epaper.vaartha.com