Nitin gadkari: రాజకీయాల నుంచి తాను తప్పుకోబోతున్నానంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, ఆ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించాయని గడ్కరీ అసహనం వ్యక్తం చేశారు.
అసలు వివాదం ఏంటి?
నాగ్‌పుర్‌లో తాను ఏర్పాటు చేసిన ‘లక్ష్మణ్‌రావ్ మన్కర్ ట్రస్ట్’ కార్యక్రమంలో గడ్కరీ ఇటీవల మాట్లాడుతూ.. వయసు పెరుగుతున్న కొద్దీ యువతరానికి బాధ్యతలు అప్పగించాలని వ్యాఖ్యానించారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో పలు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఈ సంస్థ నిర్వహణ బాధ్యతల్లో యువతకు అవకాశం ఇవ్వాలని సభ్యులకు సూచించినట్లు గడ్కరీ తెలిపారు. అయితే, ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా ఛానళ్లు ఆయన రాజకీయ రిటైర్మెంట్తో ముడిపెడుతూ కథనాలు ప్రసారం చేశాయి.

గడ్కరీ ఏమన్నారంటే..
ఈ ప్రచారాన్ని ఖండిస్తూ నితిన్ గడ్కరీ పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆయన మాటల్లోనే.. “వయసు పెరిగే కొద్దీ యువతను ప్రోత్సహించాలని, వారిని ముందుకు తీసుకురావాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను. అంతమాత్రాన నేను పదవి నుంచి గానీ, రాజకీయాల నుంచి గానీ తప్పుకుంటున్నానని అర్థం కాదు.”
“ముందు తరాల వారు తమ బాధ్యతలను మనకు ఎలా అప్పగించారో, అదే విధంగా మనం కూడా తర్వాతి తరానికి బాధ్యతలు అందించాలి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు లేదా మరేదైనా రంగం కావచ్చు.”
“గతంలో ఉన్న జర్నలిస్టుల స్థానంలో ఇప్పుడు మీరు (ప్రస్తుత విలేకరులు) పనిచేస్తున్నారు కదా! ఇది కూడా అంతే. నేను మాత్రం ప్రభుత్వం తరఫున నా బాధ్యతలను యథావిధిగా నిర్వర్తిస్తూనే ఉంటాను. గతంలో నేను చేసిన వ్యాఖ్యలకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు” అని గడ్కరీ వివరించారు.
Epaper: epaper.vaartha.com