అది జగన్ ప్రభంజన హోరులోనూ టీడీపీ జెండాను గుండెలకు హత్తుకుని.. పార్టీని నిలబెట్టిన తిరుగులేని ‘కంచుకోట’.. ఎక్కడైనా గాలి వీస్తే చెట్లు కూలిపోతాయి కానీ.. రాజమండ్రిలో మాత్రం కష్టకాలంలోనూ టీడీపీ పాతుకుపోయింది. కానీ ప్రత్యర్థుల వ్యూహాలకంటే విచిత్రంగా.. ఇప్పుడు సొంత పార్టీ నేతల ‘స్వయంకృతాపరాధాలే’ ఆ కంచుకోట పునాదులను కదిలిస్తున్నాయి. కష్టపడి ప్రజలతో మమేకమైన బలమైన నాయకులను కాదనీ.. కేవలం తెరవెనుక లాబీయింగ్‌లతో తెచ్చుకునే ‘బీఫాం’ల సంస్కృతి ఇప్పుడు ఆ పార్టీ కొంపముంచే ప్రమాదం ముంచుకొచ్చిందన్న చర్చ మున్సిపాలిటీ ప్రజల్లో సాగుతోంది.
‘రాజమండ్రి’.. ఈజీగా గెలిచే సీటు.. అంతటి బలమైన వైసీపీ జగన్ ప్రభంజనంలోనూ టీడీపీని గెలిపించి నెత్తిన పెట్టుకున్న ప్రజలు.. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినా రాజమండ్రి ప్రజలు మాత్రం టీడీపీకే జైకొట్టారు. అంతటి కంచుకోట లాంటి మున్సిపల్ స్థానంలో టీడీపీ స్వయంకృతాపరాధాలు ఇప్పుడు ఆ పార్టీ కొంపముంచేలా ఉన్నాయని టీడీపీని నమ్ముకొని వార్డుల్లో పోటీచేస్తున్న బలమైన అభ్యర్థుల్లో ఇదే చర్చ సాగుతోంది. 2014, 2019 సంవత్సరాల్లో వరుసగా టీడీపీనే రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీల్లో గెలిచి ఈ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకుంది. ఇలాంటి బలమైన స్థానంలో గ్రూపు రాజకీయాలు ఇప్పుడు పార్టీ గెలుపుపై ప్రభావం చూపేలా ఉన్నాయి. నాయకుల బలాబలాలను సమీక్షించకుండా లాబీయింగ్ తో సీట్లు కొల్లగొట్టేందుకు కొందరు వార్డుల్లో నామినేషన్లు వేసిన నేతలు టీడీపీ పెద్దలను ఒప్పిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. దీంతో గెలిచే సీట్లలో ఇతరుకులకు ఇవ్వడం వల్ల టీడీపీ కి ఇక్కడ మళ్లీ అనంతపురంలో జరిగినట్టు ఇక్కడా జరగబోతోందా? అన్న ప్రచారం ఊపందుకుంది.
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రస్తుతం హోరాహోరీగా సాగుతున్నాయి… కూటమికి మెజార్టీ దిశగా పోతోంది. కానీ టీడీపీకి అతిపెద్ద లోపం వార్డుల్లో బలమైన నేతలకు టికెట్ సెలక్షన్స్ విషయంలో పొరపాట్లు కొంపముంచేలా ఉన్నాయి. ఒక్కో వార్డుల్లో అధికారంలో ఉన్న టీడీపీ నుంచి ఇద్దరు ముగ్గురు బరిలో ఉన్నారు. వారిలో ఎవరికి బలముంది? ఎవరు గెలుస్తారన్నది క్షేత్రస్థాయిలో విచారించకుండా లాబీయింగ్ చేసిన వారికి బీఫాంలు కేటాయిస్తే టీడీపీ పుట్టిమునగడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికీ రెబల్ గా టీడీపీ తరుఫున బరిలో ఉన్న వారిని విత్ డ్రా చేయడంలో టీడీపీ పెద్దలు ఒప్పించడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో పాటు వారు లాబీయింగ్ తో టికెట్ తెచ్చుకొని అర్హులైన వారికి అన్యాయం చేయడానికి చూస్తున్నారన్న ప్రచారం ఉంది. . టీడీపీ తరుఫున ఎక్కువమంది పోటీలో ఉంటే వారిని బుజ్జగిస్తున్నా కొందరు వెనక్కి తగ్గడం లేదు. ఈజీగా గెలిచే వారికి కాకుండా బలం లేని వారికి కనుక టికెట్లు ఇస్తే… ఇలాంటి పొరపాట్లు జరిగితే రాజమండ్రిలో టీడీపీకి పెద్ద దెబ్బ పడడం ఖాయం..
ఇందుకు నిలువెత్తు నిదర్శనమే రాజమండ్రి 13వ వార్డు హుకూంపేట.. వార్డును అంటిపెట్టుకుని.. ప్రజలతో తల్లో నాలుకలా ఉంటూ అహర్నిశలు శ్రమిస్తున్న బొప్పన నానాజీ లాంటి బలమైన నేతను పక్కనపెట్టి.. మరో వ్యక్తికి టికెట్ ఇస్తే ఆ సీటు ప్రత్యర్థి పార్టీకి తాంబూలం ఇచ్చి స్వాగతం పలికినట్టే అవుతుందని వార్డు ప్రజలే బహిరంగంగా గగ్గోలు పెడుతున్నారు. ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడిని కాదని.. లాబీయింగ్‌లతో ముద్ర వేయించుకున్నవారికి గడప దాటించే ప్రయత్నం చేస్తే.. ఆ ఓట్లు చీలి ఫలితం తల్లకిందులవడం ఖాయమనే హెచ్చరికలు గట్టిగా వినిపిస్తున్నాయి. బొప్పన నానాజీ కాకుండా ఇదే వార్డులో మరో టీడీపీ నేత బరిలో ఉండడంతో ఈ సీటులో ఎవరికీ బీఫాం ఇస్తారన్న ఉత్కంఠ ఉంది. బొప్పన కాకుండా మరొకరికి బీఫాం ఇస్తే ఈ సీటు కోల్పోయే అవకాశం ఉందని వార్డు ప్రజలు ఓపెన్ గానే చెబుతున్నారు. అనంతపురం మున్సిపాలిటీలో ఇదే జరిగింది. బలమైన నేతలకు కాకుండా వేరే వారికి టికెట్లు ఇచ్చి ఈ సీటును వైసీపీకి పువ్వుల్లో పెట్టి ఇచ్చేసింది టీడీపీ.. అదే పొరపాటు ఇప్పుడు రాజమండ్రిలోని వార్డుల్లోనూ సాగుతోందన్న ప్రచారం మొదలైంది..
13వ వార్డు అయిన హుకూంపేటలో జనాలు, ఓటర్ల మద్దతు బొప్పన నానాజీకి ఉంది. కానీ మధ్యలో వచ్చిన మరో టీడీపీ నేత ఇక్కడ పోటీకి దిగి బీఫాం తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఒకవేళ బొప్పన నానాజీకి టికెట్ రాకుంటే ఈ సీటును టీడీపీ కోల్పోవడం ఖాయమన్న ప్రచారం వార్డు జనాల్లో వ్యక్తమవుతోంది. కనీసం ఈ రెబల్స్ క్యాండిడేట్లను అధిష్టానం, సీనియర్ నేతలు ఎవరూ బుజ్జగించి విత్ డ్రా చేయించడం లేదని.. ఇలా టీడీపీ తరుఫున ఎక్కువ మంది బరిలో ఉంటే ఓట్లు చీలి ప్రత్యర్థులు గెలిచే అవకాశం ఉందని అంటున్నారు.
సొంత పార్టీ నుంచి ముగ్గురు నలుగురు బరిలో దిగుతున్నా.. రెబల్స్‌ను బుజ్జగించి దారికి తెచ్చే అగ్రనేతల చొరవ కొరవడటం పార్టీకి పెను శాపంగా మారుతోంది. కూటమి గెలుపు దిశగా అడుగులు పడుతున్న వేళ.. ఈ చిన్నపాటి అభ్యర్థుల ఎంపిక పొరపాట్లు మొత్తం మున్సిపాలిీ విజయాన్నే తల్లక్రిందులు చేసే ప్రమాదం ఉంది. టీడీపీ అంతర్గత రాజకీయాలతో వార్డుల్లో టికెట్ల కేటాయింపులపై స్థానిక రాజకీయ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.. ఈ విభేదాలు పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా 13వ వార్డు హుకూంపేట అభ్యర్థిత్వం విషయంలో ప్రజల్లో మద్దతు ఉన్న బొప్పన నానాజీకి కాకుండా మరొకరికి అవకాశం ఇస్తే ఆ వార్డులో టీడీపీ ఓటమి ఖాయమని టీడీపీ మద్దతుదారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సమీకరణాలు.. స్థానిక బలాబలాలను పరిగణనలోకి తీసుకునే అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాల కంటే సొంత పార్టీ నేతల టికెట్ల పంపిణీయే రాజమండ్రి ఫలితాలను శాసించేలా ఉందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం క్షేత్రస్థాయి బలాన్ని గుర్తించి.. సరైన నిర్ణయం తీసుకోకపోతే.. రాజమండ్రిలో టీడీపీకి జరగబోయే నష్టం పూడ్చలేనిదవుతుంది..