SBI Credit Card New Rules: ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వినియోగదారులకు ముఖ్య గమనిక. 2026 డిసెంబర్ 1 నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు, రవాణా సేవలకు చేసే అధిక మొత్తపు చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధించాలని ఎస్బీఐ కార్డ్ నిర్ణయించింది.

SBI Credit Card New Rules: రూ.30 వేలకు పైగా రవాణా సేవల చెల్లింపులపై 1 శాతం ఛార్జీ
కొత్త నిబంధనల ప్రకారం, ఒకే లావాదేవీలో రూ.30,000 కంటే ఎక్కువ మొత్తాన్ని రవాణా సేవల (ట్రాన్స్పోర్ట్) కోసం ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే 1 శాతం అదనపు ఛార్జీ విధిస్తారు. ముఖ్యంగా MCC 4111, 4784, 4131 కేటగిరీల కింద నమోదయ్యే లావాదేవీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు క్రెడిట్ కార్డుతో రవాణా సేవల కోసం రూ.35,000 చెల్లిస్తే, అదనంగా రూ.350 ఛార్జీ పడుతుంది. అంటే అసలు చెల్లింపుతో పాటు ఈ అదనపు మొత్తం కూడా క్రెడిట్ కార్డు బిల్లులో కలుస్తుంది. కాబట్టి రవాణా సేవల కోసం పెద్ద మొత్తంలో కార్డు ఉపయోగించే వారు ఈ మార్పును గుర్తుంచుకోవాలి.
రూ.50 వేలకు పైగా ఫ్యూయల్ ఖర్చుపై అదనపు భారం
పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనల్లోనూ ఎస్బీఐ కార్డ్ మార్పులు చేసింది. ఒక బిల్లింగ్ సైకిల్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చేసే అర్హత కలిగిన ఫ్యూయల్ లావాదేవీల మొత్తం రూ.50,000 దాటితే 1 శాతం అదనపు ఛార్జీ విధిస్తారు. MCC 5172, 5541, 5542, 5983 కేటగిరీల కింద జరిగే ఫ్యూయల్ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. రూ.50,000 దాటిన అదనపు మొత్తంపై మాత్రమే కాకుండా, ఆ బిల్లింగ్ సైకిల్లోని మొత్తం అర్హత కలిగిన ఫ్యూయల్ ఖర్చుపై 1 శాతం ఛార్జీ విధిస్తారు. ఉదాహరణకు, ఒక బిల్లింగ్ సైకిల్లో ఇంధనం కోసం రూ.60,000 ఖర్చు చేస్తే, మొత్తం మొత్తంపై 1 శాతం చొప్పున రూ.600 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
డిసెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎస్బీఐ కార్డ్ ప్రకటించిన ఈ కొత్త నిబంధనలు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే నవంబర్ నెల వరకు పాత నిబంధనలే కొనసాగుతాయి. అదనపు ఛార్జీల భారం తగ్గించుకోవాలంటే వినియోగదారులు ప్రతి బిల్లింగ్ సైకిల్లో ఫ్యూయల్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో ముందుగానే అంచనా వేసుకోవాలి. అలాగే రవాణా సేవలకు చేసే చెల్లింపులు రూ.30,000 పరిమితిని దాటుతున్నాయా లేదా గమనించాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com