Telangana Politics : తెలంగాణలో కాంగ్రెస్ కొలువుదీరి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. రెండేళ్ల తర్వాత జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే .. వచ్చే ఎన్నికలపై అప్పుడే ఫోకస్ పెట్టారు కొందరు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు సీనియర్ మంత్రులు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఐదుగురు మంత్రులు అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారన్న గాసిప్ గాంధీభవన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమరానికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయిన జాబితాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజానర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు ఉన్నారట. వీరిలో కొందరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాం.. కానీ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉంటామని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇప్పుడిదే తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆలోచన చేస్తున్న మంత్రులు ఒకొక్కరు ఒక్కొక్క వెర్షన్ వినిపిస్తున్నారట. మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు వచ్చే ఎన్నికల్లో వారి వారసులను బరిలోకి దింపాలని చూస్తున్నారట. దామోదర రాజనర్సింహ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. తన కూతురు త్రిషను పోటీ చేయించే యోచనలో ఉన్నారట. అలాగే జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి మూడు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గౌరవప్రదంగా తప్పుకొని కొడుకు జూపల్లి అరుణ్‌ను రాజకీయాల్లోకి తేవాలని భావిస్తున్నారట. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరావు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని తన మనసులో మాటను సన్నిహితులకు చెప్పేశారట.
ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అరుదైన ఘనత తుమ్మల నాగేశ్వరరావుది. మంత్రిగా పని చేసిన రికార్డ్ ఉన్న నేపథ్యంలో గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారట. అయితే తన వారసున్ని రాజకీయాల్లోకి తెచ్చే ఆలోచన మాత్రం ఆయనకు లేదని తెలుస్తోంది. కానీ, ప్రస్తుతం తుమ్మల తనయుడు మాత్రం ఖమ్మం నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
ఇక క్యాబినెట్లో.. పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు భరించలేకపోతున్నానని.. అందుకే పోటీ చేయబోనని అంటున్నారట మంత్రి ఉత్తమ్. అవసరమైతే పార్లమెంట్ ఎన్నికల్లో కంటెస్ట్ చేసే ఆలోచన చేస్తున్నారట. జమిలి ఎన్నికలు వస్తే.. నల్లగొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారట.
అలాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉందట. ఇప్పటికే నల్లగొండలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 50వేల మెజారిటీ ఇస్తామంటేనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. ఇలా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని చెబుతుండటం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఓ దక్షిణ తెలంగాణ మంత్రి మరో అడుగు ముందుకేసి చెప్తున్న రీజన్ మరింత షాకింగ్‌గా ఉందట. మే, జూన్ తర్వాత కూడా ఎల్‌నినో ప్రభావం ఇలాగే ఉంటే పోటీ చేయకపోవడమే బెటర్ అనే చెప్పుకొచ్చారట. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ.. హెచ్ఐసీసీ కట్టినా.. చివరికి కరువు వచ్చి ఓడిపోయారని గుర్తు చేస్తున్నారట.
ఎల్‌నినో ఎఫెక్ట్ జూన్ తర్వాత కూడా కొనసాగితే తమ పరిస్థితి కూడా ఇంతేనేమో అంటూ మనసులో మాట బయటపెట్టారట. ఎల్‌నినో, కరువు అని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని.. వాళ్లకు కావాల్సి ఇవ్వకపోతే ఓటమే దిక్కు అన్నట్లుగా తన ఒపీనియన్‌ను వ్యక్తం చేశారట. దీని కంటే ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే ఉత్తమమని అంటున్నారు. మరి అమాత్యుల వారు ఇదే మాటపై ఉంటారో.. పరిస్థితులు అనుకూలిస్తే మళ్లీ మనసు మార్చుకొని పోటీకి సై అంటారో వేచి చూడాలి మరి.