Kadiri: కార్తీక మాసంలో కదిరిలో ఘనంగా ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు!
Kadiri: కార్తీక మాసంలో కదిరిలో ఘనంగా ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు!
శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి:�కార్తీక మాస పర్వదినాల సందర్భంగా కదిరి పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ మరకత శివాలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు సంబంధించిన విగ్రహ, యంత్ర, పీఠ దేవత, శిఖర కలశ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ఎస్.వి.జె. రమేష్ దానం చేయగా, శ్రీ మరకత శివలింగ విగ్రహాన్ని వి.ఆర్.సి. బాబు దానం చేశారు. వీరి దాతృత్వంతో ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాలు మరింత విశేషంగా జరిగాయి.
ఈ నెల 14, 15, 16 తేదీల్లో మూడు రోజులపాటు వివిధ ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, యాగశాల కార్యక్రమాలు, కలశ పూజలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.
ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల 57 నిమిషాలకు శుభ ముహూర్తంలో ప్రధాన ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తుల మధ్య ఓం నమఃశివాయ, గోవిందా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం ప్రత్యేక పూజలు, మహా నైవేద్యం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.
మూడు రోజులపాటు జరిగిన ఈ పవిత్ర మహోత్సవాల్లో భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్తీక మాసంలో జరిగిన ఈ ప్రతిష్ఠా మహోత్సవాలతో కదిరి పట్టణంలో భక్తిభావ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ఖాద్రి విశ్వబ్రాహ్మణ సంఘం ఆలయ కమిటీ గౌరవ సలహాదారులు రాజశేఖర్ ఆచారి, అధ్యక్షులు శివాచారి, ప్రధాన కార్యదర్శి ఎస్.వి. రమణాచారి, అధికార ప్రతినిధి హరిప్రసాద్ ఆచారి, కార్యనిర్వాహక కార్యదర్శి పి.ఎల్. ఆచారి, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.