Meenakshi Energy Limited : ఆంధ్రప్రదేశ్లో వేదాంత పవర్ అనుబంధ సంస్థ అయిన మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (ఎంఈఎల్), నెల్లూరులోని ఎస్విఐసిసిఎఆర్ (SVICCAR) ఆసుపత్రి సహకారంతో ‘ప్రాజెక్ట్ ఆరోగ్య’ కింద గ్రామీణ ప్రజల ఇంటి వద్దకే నివారణ ఆరోగ్య సేవలను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో 120 మందికి పైగా స్థానికులకు గర్భాశయ, రొమ్ము మరియు నోటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాన్సర్ లక్షణాలను తొలిదశలోనే గుర్తించడం, స్వీయ పరీక్షా పద్ధతులు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు. తదుపరి వైద్యం అవసరమైన వారిని గుర్తించి, ప్రత్యేక చికిత్స కోసం ఆసుపత్రులకు సిఫార్సు చేయడంతో పాటు ఉచిత వైద్యానికి సంస్థ పూర్తి మద్దతు అందిస్తోంది.

సామాజిక సంక్షేమమే లక్ష్యంగా విస్తృత ఆరోగ్య కార్యక్రమాలు
కేవలం వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కాకుండా చుట్టుపక్కల గ్రామాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని మీనాక్షి ఎనర్జీ తాత్కాలిక సీఈఓ కె. బినూ రాఫెల్ తెలిపారు. ‘ప్రాజెక్ట్ ఆరోగ్య’, ‘ప్రాజెక్ట్ వికాసిని’ కార్యక్రమాల ద్వారా మహిళలు, పిల్లలు మరియు బలహీన వర్గాల కోసం ప్రత్యేక గైనకాలజీ శిబిరాలు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్డుల పంపిణీ వంటి సేవలను అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఆసుపత్రులకు వెళ్లే శ్రమ లేకుండా తమ గ్రామంలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరగడం ఎంతో ఉపశమనం కలిగించిందని వరగల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు కామేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు.