ఎంఆర్ కిట్లు, సీపీ చైర్లు, వాకర్ల పంపిణీ

కె.కోటపాడు, జూన్ 16(క్విక్ న్యూస్): ప్రత్యేక అవసరాలు గల పిల్లల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో-1 సత్యనారాయణ, ఎంఈవో-2 డి.వి.డి. ప్రసాద్ సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ALIMCO, NIEPID సంస్థలు అందించిన సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ (ఎంఆర్ కిట్లు), సీపీ చైర్లు, వాకర్లు అందజేశారు. తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ.. ఉపకరణాల వినియోగం ద్వారా పిల్లల్లో మానసిక వికాసం, ఏకాగ్రత, అభ్యాస సామర్థ్యం మెరుగుపడటంతో పాటు స్వయం ఆధారిత జీవన నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు.ప్రత్యేక అవసరాలు గల పిల్లల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి విద్యార్థి వాటిని పొందేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎస్.వి. పద్మావతి, ప్రత్యేక ఉపాధ్యాయులు సి.హెచ్. కన్నమ్మ, కె. పరదేశి తదితరులు పాల్గొన్నారు.