మట్టి వినాయకుడినే పూజిద్దాం అంటూ నినాదాలు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని విద్యార్థులు అవగాహన కల్పించారు. తెనుగుపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి, వాటిని చేతబట్టి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి గ్రామంలోని వీధుల గుండా ర్యాలీ సాగింది.మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమల వినియోగం వల్ల కలిగే పర్యావరణ నష్టాలను నివారించేందుకు మట్టి వినాయక ప్రతిమలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు డి.ఎస్.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. మట్టి వినాయక ప్రతిమల తయారీ ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలికితీసినట్లు తెలిపారు. ప్రతిమలు తయారు చేసిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్దాడ వెంకట రమణ, శ్రీనివాసరావు, మహేశ్వరరావు, మాధవరావు, త్రినాథ్, అనూరాధ, కొండమ్మ, సోములమ్మ, జగన్ మనోహర్, సుగుణకుమారి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.