వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మాజీ డిప్యూటీ సీఎం బూడి పిలుపు
స్థానిక సంస్థల ఎన్నికలను సమరంగా భావించి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమష్టిగా పనిచేసి ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పార్టీ సత్తా చాటాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటే స్థానిక ఎన్నికల నుంచే పార్టీ విజయానికి పునాది వేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దేవరాపల్లి మండలం తారువలో గురువారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నట్లు బూడి తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి నాయకులు, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. కాశీపురం పంచాయతీ పరిధిలోని చంద్రయ్యపేటలో మూతపడిన పాఠశాలకు ప్రహరీ నిర్మించి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు 60 ఏళ్లకే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం, అందుకు కేవలం ఏడు రోజుల సమయం ఇవ్వడం దారుణమని బూడి విమర్శించారు. అర్హత ఉన్న లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే సమయంలో సర్వర్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగన్ హయాంలో అర్హతే ప్రామాణికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు.ఎన్నికల నిర్వహణపై విమర్శలుస్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని బూడి అన్నారు. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గడిచిన రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం అంతంతమాత్రంగానే ఉన్నాయని విమర్శించారు.రోడ్ల దుస్థితిపై ప్రజలు స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే.. ఇరాన్ యుద్ధం కారణంగా తారు దొరకడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు మండలం ఏ.కోడూరుకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చినా స్థానిక రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు చొరవ చూపకపోవడం విచారకరమన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడి రైతులకు సుమారు రూ.35 కోట్ల బకాయిలు ఉండగా, కనీసం ఆ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదని ఆరోపించారు.జలాశయాల అభివృద్ధి లేక సాగునీరు సక్రమంగా అందక ఖరీఫ్ పంటలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. విద్యుత్ సమస్యలతో పల్లె ప్రజలు చీకటిలో గడపాల్సి వస్తోందన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు.జగన్ పాదయాత్రరాష్ట్ర ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు బూడి తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, గ్రామాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్‌సీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పైలా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, గ్రామాల్లో ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. సమష్టి కృషితోనే ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండా విజయకేతనం ఎగురుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు శోభా హైమావతి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు, ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌రావు, చింతల బుల్లిలక్ష్మి, రాజారామ్, పెదబాబు, జడ్పీటీసీ కర్రి సత్యం, దొరబాబు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.