– ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు మాడుగుల నుంచి 50 బస్సులలో 2 వేల మంది
మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మణిహారంగా నిలుస్తుందని, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రారంభోత్సవానికి మాడుగుల నియోజకవర్గ పరిధిలోని దేవరాపల్లి, కె కోటపాడు మండలాల నుంచి సుమారు 2 వేల మంది ప్రజలను 50 ప్రత్యేక బస్సుల్లో తరలించనున్నట్లు చెప్పారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అల్పాహారం, భోజనం, ప్రతి బస్సుకు నలుగురు ఇన్చార్జ్లు, జియో ట్యాగింగ్, కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థ వంటి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై దేవరాపల్లి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ అబ్జర్వర్, పూతలపట్టు ఎమ్మెల్యే డా. కలికిరి మురళీమోహన్ తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. బస్సుల రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. సబ్బవరం–గుల్లిపల్లి మీదుగా భోగాపురానికి చేరుకునే మార్గంలో ట్రయల్ రన్ కూడా నిర్వహించినట్లు చెప్పారు. దేవరాపల్లి మండలంలోని 19 సచివాలయాల పరిధి నుంచి ప్రజలు కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. ఒక్కో గ్రామం నుంచి 60 మంది చొప్పున తరలించేలా ప్రణాళిక రూపొందించామని, ఉదయం 5 గంటలకే బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. తర్లువాడలోని సన్ రే రిసార్ట్ లో భోజన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మొబైల్ ఫోన్ నెట్వర్క్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను సురక్షితంగా తీసుకెళ్లి తిరిగి తీసుకురావడంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. వెలుగు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల సమన్వయంతో ప్రయాణ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. దేవరాపల్లి అబ్జర్వర్, కార్పొరేషన్ డైరెక్టర్ యర్ర వేణుగోపాలనాయుడు మాట్లాడుతూ.. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, చిన్నారులు ఈ ప్రయాణానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ కిరణ్ వర ప్రసాద్, తహశీల్దార్ పి. లక్ష్మిదేవి, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ, రైవాడ జలాశయ చైర్మన్ పోతల పాత్రునాయుడు, శరకాన సూర్యనారాయణ, పూడి సత్యారావు, చల్లా తాతయ్యలు, అల్లు శ్రీనివాసరావు, గట్రెడ్డి కొండలరావు(జికె), ఇన్చార్జ్ డిప్యూటీ ఎంపీడీఓ అనంత ఉమాదేవి, ఏపీఎం ప్రభాకరరావు, ఏపీఓ రుక్మిణీదేవి తదితరులు పాల్గొన్నారు.