96MEDIA – #AP INDIA

జర్నలిజం మౌలిక సూత్రాలకు అనుగుణంగా మీడియా పని చేయాలి – సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు

96మీడియా,విజయవాడ:- జర్నలిజం మౌలిక సూత్రాలకు విరుద్ధంగా, ఇష్టారీతిగా ప్రస్తుతం కొన్ని మీడియా వర్గాలు వార్తలు ప్రచురించడం శోచనీయమని, సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. స్థానిక టాగోర్ లైబ్రరీ లో బుధ వారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సమావేశం లో ఆయన మాట్లాడుతూ,ప్రస్తుతం జర్నలిజం “క్రాస్ రోడ్స్” వద్ద దిక్కు తోచని స్థితిలో వుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ధోరణి ని పాత్రికేయులే సరిదిద్దాలని ఆయన పేర్కొన్నారు. జర్నలిజం మౌలిక సూత్రాల ప్రకారం తమకు నష్టం కలిగినా, వాస్తవాన్ని మాత్రమే వార్తగా ప్రచురించాల్సి వుందన్నారు. ఆరోపణలకు గురైనవారి కథనం లేకుండా వార్త ప్రచురించడం ఈ సూత్రాలకు పూర్తి విరుద్ధం అని జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నారు. రాజకీయ పరంగా వారి వారి సంబంధాలు ఎలా వున్నా, జరుగుతున్న సంఘటనల్ని వక్రీకరించడం సరైన పద్దతి కాదన్నారు. అదేవిధంగా, ఒకే అంశం పై ప్రాంతాలవారీగా విభిన్న సూత్రీకరణలు, వార్తా కథనాలు వెలువడుతుండడం యిటీవలి కాలం లో పెరిగిపోయిందన్నారు. ఇదంతా జర్నలిజం లో నైతిక సూత్రాలను పాటించక పోవడం వల్లనే జరుగుతోందన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.

పాత్రికేయులందరూ తమ తమ సంఘాల పరిధి లో పనిచేస్తూనే, ఉమ్మడి సమస్యల పట్ల ఐక్యం గా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సి.ఆర్. మీడియా అకాడమీ అన్ని జర్నలిస్టుల యూనియన్లతో స్నేహ పూర్వక వాతావరణం కలిగి వుంటుందని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులు అందరితో కలిసి పనిచేయాలని కోరుకుంటుందని ఆయన అన్నారు. అటువంటి స్నేహ పూర్వక వాతావరణం యేర్పడేందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.

సి.ఆర్. మీడియా అకాడమీ ఇటీవల ప్రవేశ పెట్టిన జర్నలిజంలో డిప్లమా కోర్సు లో 310 మంది చేరి ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి 10 గంటల వరకు ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్నారని ఆయన వివరించారు. డిప్లమో కోర్సు లోని సిలబస్ తో పాటు ప్రతి శనివారం సామాజిక, ఆర్ధిక, పరిపాలన వంటి అంశాల మీద ప్రముఖులతో ఆన్ లైన్ విధానంలో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ అవగాహనా తరగతులలో పాల్గొని పలు అంశాల పై విజ్ఞానం పెంచుకోవాలని జర్నలిస్టులకు ఆయన సూచించారు. త్వరలోనే, రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులు ఈ అవగాహన తరగతుల్లో పాల్గొని, ప్రధాన అంశాల పై అవగాహన కల్పించనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే “లింక్” ను అన్నిజర్నలిస్టుల యూనియన్లకు పంపుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనల్లో అక్కడి జర్నలిస్టులకు కూడా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లాలో “మడ అడవుల”సంరక్షణ పై అవగాహన కల్పించామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో “గుడ్ గవర్నెన్స్” పై అవగాహన కల్పించామన్నారు.

కార్యక్రమంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ శ్రీ ఆర్. ఎం. భాషా, అధికార భాష కమిటీ అధ్యక్షులు శ్రీ విజయ బాబు,సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రటరీ శ్రీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ ఎస్. వెంకట రావు, ప్రధాన కార్యదర్శి శ్రీ జి. ఆంజనేయులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More