96MEDIA – #AP INDIA

రాష్ట్రంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా విమ్స్ రికార్డ్

మరో మైలిరాయి చేరుకున్న విమ్స్
-రాష్ట్రంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా రికార్డ్
-అనుమతులు పొందిన నెల రోజుల్లోనే అవయవాల సేకరణ
-నలుగురు జీవితాల్లో కొత్త వెలుగులు

96మీడియా,విశాఖపట్నం:- కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తగ్గకుండా ఎన్నో అత్యాధునిక సర్జరీలు చేసి అనేక మైలురాయులకు కేంద్రమైన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరో మైలి రాయి చేరుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించి రాష్ట్రంలోని తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా రికార్డ్ నమోదు చేసింది. సాధారణంగా బ్రెయిన్ డెడ్ కేసులు కార్పొరేట్ ఆసుపత్రిలో మాత్రమే అవయవాలును సేకరించడం జరుగుతుంది .కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాసుపత్రి అయిన విమ్స్ నందు శుక్రవారం బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ నుంచి అవయవాలను సేకరించారు.

మహిళ నుంచి నాలుగు అవయవాలు సేకరణ
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి చంద్రకళ (32) గత నెల 31వ తేదీన తీవ్ర తలనొప్పితో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వైద్యం నిమిత్తం ఆమెను విమ్స్ ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. న్యూరో సర్జరీ వైద్యులు ఆధ్వర్యంలో ఆమెకు వైద్య పరీక్ష నిర్వహించగా తలలో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు .రక్తస్రావం తగ్గించడానికి వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ నియంత్రణలోకి రాకపోగా శరీరంలోని ఒక్కొక్క అవయవము పనిచేయటం మానేస్తున్నాయి. దీంతో వైద్య బృందం గురువారం చంద్రకళను బ్రెయిన్ డెడ్ గా ధ్రువీకరించారు. బ్రెయిన్ డెడ్ విషయం తెలుసుకున్న విమ్స్ డైరెక్టర్ జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె. రాంబాబు మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించారు. దీంతో ఆమె నుంచి రెండు కిడ్నీలు, రెండు కళ్ళను సేకరించారు.

నలుగురు జీవితాల్లో కొత్త వెలుగులు
చంద్రకళ నుంచి సేకరించిన అవయవాలతో నలుగురు జీవితాలలో కొత్త వెలుగులు రానున్నాయి. ఆమె నుంచి సేకరించిన రెండు కిడ్నీలను రెండు ఆస్పత్రులకు చెరొక కిడ్నీ కేటాయించగా రెండు కళ్ళును ఎల్వి ప్రసాద్ ఐ ఆస్పత్రికి కేటాయించారు. జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం ఆ అవయవాలను అవసరమైన రోగులకు కేటాయించారు.

ఘన వీడ్కోలు
మరణించిన తరువాత కూడా నలుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన చంద్రకళ మృతదేహానికి విమ్స్ ఆస్పత్రి సిబ్బంది ఘన వీడ్కోలు పలికారు. ఆమె మృతదేహానికి సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు పూలమాలవేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఆస్పత్రి సిబ్బంది పూలజల్లుతూ ఘన వీడ్కోలు పలికారు.

అనుమతి పొందిన నెల రోజుల్లోనే
బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించేందుకు విమ్స్ ఆస్పత్రికి ఏప్రిల్ 26వ తేదీన అనుమతులు రాగా. కేవలం నెలరోజులు వ్యవధి లోనే తొలి సర్జరీ చేసి రికార్డు నమోదు చేసింది. అనుమతులు పొంది అతి తక్కువ సమయంలోనే అవయవాలు సేకరించిన తొలి ఆసుపత్రిగా కూడా విమ్స్ రికార్డ్ సృష్టించింది.

అవయవాల కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు
రాష్ట్రవ్యాప్తంగా 2900 రోగులు అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని విమ్స్ డైరెక్టర్ జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె. రాంబాబు అన్నారు. అవయవ దానానికి ముందుకు వచ్చిన చంద్రకళ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. చంద్రకళ కుటుంబ సభ్యుల లాగే బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు కూడా అవయవాలు దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరణించిన తర్వాత మరొకరికి పునర్జన్మ నివ్వటం ఎంతో అదృష్టం అని కాబట్టి మూఢనమ్మకాలు వీడి అవయవ దానానికి ముందుకు రావాలన్నారు. అతి తక్కువ సమయంలోనే ఆమె శరీరం నుంచి అవయవాలను సేకరించేందుకు వైద్య బృందం చేసిన కృషిని అభినందించారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More